తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు సీడబ్ల్యూసీ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖామన్నారు. రేవంత్ చూసి రమ్మంటే.. కాల్చి వచ్చే రకమన్నారు. రాహుల్ గాంధీకి కుడిభుజంలా రేవంత్ పని చేస్తున్నాడన్నారు సుబ్బిరామి రెడ్డి.
రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో పాదయాత్ర తమిళనాడు, కేరళలో దిగ్విజయంగా విజయవంతం అయిందన్నారు. కర్ణాటకలో కూడా ఈ యాత్రకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. తెలంగాణలో కూడా రాహుల్ పాదయాత్రను విజయవంతం చేద్దామన్నారు సీడబ్ల్యూసీ సభ్యుడు సుబ్బిరామి రెడ్డి.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో జరిగే రాహుల్ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులూ పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రతి గడప నుంచి ప్రజలు వచ్చి పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చొరవ చూపాలన్నారు. దేశంలో భారత్ జోడో యాత్ర చారిత్రాత్మకంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు.
కుల, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ ఆర్థిక సంపదను దోచి పెడుతున్న కొద్ది మంది పరిపాలనకు స్వస్తి పలకడానికే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టాలన్నారు. బీజేపీ పాలనలో దేశంలో పెరుగుపోతున్న రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పాదయాత్ర ఎన్నికల కోసమో.. కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు.. దేశ జాతి ఐక్య నిర్మాణానికి చేస్తున్న యాత్ర అన్నారు భట్టి విక్రమార్క.