ఏఐసీసీకి పూర్తికాలపు అధ్యక్షుడి ఎన్నికే ప్రధాన అంశంగా ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింట్ కమిటీ సమావేశమైంది. దీంతో పాటు పార్టీలో సంస్థాగత ఎన్నికల, ప్లీనరి సమావేశాల షెడ్యూల్ వంటి అంశాలపై కూడా చర్చించనుంది.కాగా శాశ్వత అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ లేక ఆశోక్ గెహ్లాట్‌ని ఎంపిక చేస్తారన్న ప్రచారం ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఎక్కువ మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆయన నిర్ణయం ఏమిటన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ప్రస్తుత సమావేశం జరుగుతోంది. త్వరలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో.. ఆలోపు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవితోపాటు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని నేతలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.