రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండటంపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేసేందుకు డయల్ 100 లేదా 155260 కాల్ చేయాలని సూచిస్తున్నారు. భాదితులు డబ్బులు కోల్పోతే వెంటనే ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో 100, జాతీయ స్థాయిలో 155260 నెంబర్లు పనిచేస్తాయంటున్నారు.
మోసపూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే ..వాటిని తక్షణం నిలిపి వేయడంతో పాటు అవతలివారి ఖాతాను ఫ్రీజ్ చేసే విధంగా చూడొచ్చని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్తులను గుర్తించడం, వారికి శిక్ష పడేలా చేయడాన్ని పోలీస్ శాఖ చాలెంజ్‌గా తీసుకుందని వెల్లడించారు. పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ వారియర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు.