సైబర్ నేరగాళ్ల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు పోలీసులు చెబుతున్నా.. జనం మాత్రం వారి ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు. చదువులేని వారు మాత్రమే కాదు.. చదువుకుని మంచి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వారి బాధితులవుతున్నారు. తాజాగా క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట ఓ న్యాయవాదికి కుచ్చు టోపి పెట్టారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసమోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు.
డీటైల్స్ లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరత్నం అనే లాయర్ కి ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ చేయాలంటూ సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు.
ఇది నమ్మిన న్యాయవాది వెంకటరత్నం సరే అని చెప్పి.. బ్యాంకుకు సంబంధించిన డీటైల్స్ చెప్పారు. అనంతరం మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని వారికి చెప్పారు లాయర్.
అంతే వెంకటరత్నం బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.33,500 డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటరత్నం స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.