సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట మోసాలు జరుగుతునే ఉన్నాయి. సైబర్వం నేరగాళ్లు వందలు, వేలు కాదు.. ఏకంగా లక్షల్లోనే కొట్టేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మోసాలు నగరాలకే పరిమితం కాగా ఇప్పుడు జిల్లాలకు పాకింది. లోన్ వచ్చిందంటూ ఫోన్ చేయడం..వారి ఖాతాలో ఉన్న డబ్బులను ఖాళీ చేయడం నేరగాళ్లకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది.
సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఈ మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.లోన్ కి ఆశపడి లక్షా 7 వేలు పొగొట్టుకున్నాడు ఓ యువకుడు. గుర్తు తెలియని నంబర్ నుంచి లోన్ మంజూరైందని ఫోన్ వచ్చింది. ప్రొసెసింగ్ ఫీజు ఉందని అతనిని బురిడీ కొట్టించాడు సదరు మోసగాడు. అది నిజమని నమ్మిన బాధితుడు సరే అంటూ పలుమార్లు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లక్ష 7 వేలు చెల్లించాడు.
లోన్ ఎంత వచ్చింది. ఎప్పుడూ తన ఖాతాలో పడుతుందనే విషయం గురించి తెలుసుకోవడానికి తిరిగి ఆ నెంబర్ కి చేస్తే ఫోన్ కలవడం లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయామని బాధితుడు గుర్తించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి మోసమే కామారెడ్డి జిల్లాలో కూడా వెలుగు చూసింది.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లి గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి బజాజ్ ఫైనాన్స్ లో లోన్ మంజూరు అయ్యిందంటూ గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ప్రొసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర ఛార్జీల కింద కొంత నగదు పంపాలని వారు సూచించారు. దీంతో వారికి 85,033 రూపాయలు చెల్లించాడు.
తరువాత తిరిగి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.