- నకిలీ ఖాతాలతో నిలువు దోపిడీకి స్కెచ్..!
- కాంటాక్ట్స్ జాబితాలో ఉన్నవారికి డబ్బుల గాలం
ఫేస్‌బుక్ వేదికగా ఇటీవల జరుగుతున్న ఆర్థిక మోసాల్లో ఈ తంతు మరీ ఎక్కువైంది. ఇతరుల ఫేస్‌బుక్ పేజీల్లోని కవర్ ఫొటోలను నకలు చేసి అవే పేర్లతో కొత్త అకౌంట్లు సృష్టించడం, కాంటాక్ట్స్ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు అడుగుతూ పోస్టులు పెట్టడం. లేదా మెసెంజర్‌లో మెసేజ్‌లు పంపడం. ఇదీ ఈ సరికొత్త మోసం తీరూ తెన్ను. నకిలీ ఖాతాలతో నిలువు దోపిడీ చేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు రాజకీయ నాయకులపై కన్నేశారు. మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ తో సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతున్నారు. ఇది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలంలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాను కేటుగాళ్లు తెగ వాడేస్తున్నారు.ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. తాజాగా రాజకీయ నాయకులను ఆసరాగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు.. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి పేరిట క్రియేట్ చేసిన ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ లో యోగక్షేమాలు తెలుసుకుని.. తన మిత్రుడు ఆసుపత్రిలో ఇబ్బందుల్లో ఉన్నాడనే కారణంతో డబ్బులు అడిగాడు. గూగుల్ పే ద్వారా రూ. 15 వేలు పంపండంటూ మెసేజ్ చేయడంతో అనుమానం వ్యక్తమైంది.
మాజీ ఎమ్మెల్యే పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ప్రజలను ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.
పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో, బస్ స్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో తదితర ప్రాంతాలలో ప్రజలకు సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలంటూ అప్రమత్తం చేస్తున్నారు.