సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉంటున్నారు. సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఇలా కూడా చేయొచ్చా? అని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఒక మోసం నుంచి బయటపడి ప్రజల్లో అవగాహన వచ్చేలోపే.. సైబర్ నేరగాళ్లు మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా అలాంటి కొత్త తరహా మోసమే కామారెడ్డి జిల్లాలో బయటపడింది.
డీటైల్స్ లోకి వెళ్తే.. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్ అనే వ్యక్తికి ఫోన్ చేశారు సైబర్ కేటుగాళ్లు. మూడు నెలల కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ బెదిరించారు. వెంటనే చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ హెచ్చరించారు. ఇక టైం లేదని, మీకు ఇప్పుడే లింక్ పంపుతున్నాం.. ఆన్ లైన్ లో బిల్లు చెల్లించాలంటూ చెప్పారు. దీంతో రాజేశ్వర్ ఆ లింక్ ఓపెన్ చేయగానే.. తన అకౌంట్ లో ఉన్నా రూ.49 వేలు ఖాళీ అయిపోయాయి.
రూ.49 వేలు కట్ అయినట్లు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగదుపై ఫ్రీజింగ్ విధించినట్లు తెలిపారు. ఇది మరో తరహా కొత్త రకం మోసమని పేర్కొన్నారు. సాధారణంగా కరెంట్ బిల్లు కట్టకపోతే.. విద్యుత్ సిబ్బంది ఫోన్ చేసి బిల్లు కట్టమని అడగరని పోలీసులు స్పష్టం చేశారు.
విద్యుత్ సిబ్బంది డైరెక్ట్ గా ఇంటికే వచ్చి బిల్లు కట్టమని చెబుతారని పేర్కొన్నారు. ఇకపై ఇలా ఎవరైనా కాల్ చేస్తే.. అది ఖచ్చితంగా మోసగాళ్లే పని అయి ఉంటుందని దీన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. ఈ మాత్రం అవగాహన లేకపోతే ఇలాంటి సైబర్ నేరగాళ్ల బారినపడటం ఖాయమంటున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు.