సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఆర్మీ అధికారి పేరుతో ఓ వ్యక్తికి టోకరా వేశాడు సైబర్ కేటుగాడు. మొత్తం 5 లక్షల పైగా కాజేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే బాగ్ అంబర్ పేట్ కు చెందిన రాఘవ చారి తన ఇంట్లో ఉన్న సోఫా సెట్ ను విక్రయించాలి అనుకొని ఓఎల్ఎక్స్ లో ప్రకటన ఇచ్చాడు. ముఖేష్ కుమార్ నంటూ రాఘవ చారి కి కాల్ చేసిన కేటుగాడు… తాను ఆర్మీ అధికారి అని కార్యాలయంలో సోఫా అవసరముందని, తాను కొనుగోలు చేస్తానని చెప్పాడు.
ఇద్దరి మధ్య 40,000 ఒప్పందం కుదిరింది. మొబైల్ కు ఒక లింకును పంపిస్తున్నానని, ఆ లింక్ క్లిక్ చేసి పది రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి కన్ఫామ్ చేయాలని సూచించడంతో రాఘవ చారి అలానే చేశాడు. దీంతో అతని ఖాతాలో డబ్బు కేటుగాడు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఏదో పొరపాటు జరిగినట్టుంది అని తన మొత్తం డబ్బులు పంపిస్తున్నానని నమ్మబలికి మరో లింకు పంపించాడు.
ఇలా పలు విడతలుగా రాఘవాచారి ఖాతా నుండి 5 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.