రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతోంది. తాజాగా హైదరాబాద్ గోల్కొండలో లాటరీ పేరుతో అబ్దుల్ ముజీబ్ అనే వ్యక్తిని మోసం చేశారు కేటుగాళ్లు. విలువైన కారు గెలుచుకున్నారంటూ ఫోన్ చేసి రూ.17.35 లక్షలు దోచేశారు. కారు కావాలా..? క్యాష్ కావాలా అని అడగ్గా.. బాధితుడు నగదు కావాలని చెప్పాడు. అయితే ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలంటే కొంత సొమ్ము పే చేయాలని చెప్పి.. అన్ లైన్ ద్వారా రూ.17.35 లక్షలు కాజేశారు చీటర్స్. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక ఆన్ లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు అంటూ ఇద్దరు వ్యక్తుల నుండి రూ.3.7 లక్షలు దోచేశారు కేటుగాళ్లు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
గతంలో గిఫ్ట్ పేరుతో రూ.16 లక్షలు కాజేసిన కేసును ఛేదించారు పోలీసులు. ఓ నైజీరియన్ ని అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లికి చెందిన మహిళకు విలువైన బహుమతి వచ్చిందని కాల్ చేసి… కొంత సొమ్ము కట్టాలని రూ.16 లక్షలు దోచేశాడు. తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీలో మైకేల్ అనే నైజీరియన్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.