సైబర్ మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పైసల ఆశ చూపించి మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రాఫిట్ పేరుతో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఆ తరహా మోసాలు జరిగాయి. క్రిప్టో ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ చీటర్స్.. ఏకంగా రూ.70 లక్షలు కాజేశారు. తాను మోసపోయామని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదే తరహా మరో మోసం వెలుగు చూసింది. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో రూ.28 లక్షలు కాజేశారు. బిజినెస్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి ఏకంగా రూ.28 లక్షలు కాజేశారు. లాభాల సంగతి దేవుడెరుగు.. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు.
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసం పోయామని.. అంబర్ పేట్ కి చెందిన ముగ్గురు యువకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అయితే.. డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీపై ప్రజలకు పెరుగుతున్న మోజును సొమ్ము చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.