డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ పై సిబ్బంది మరింత అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ల వారీగా డ్రగ్స్ కేసులపై సమీక్షించారు. డ్రగ్స్ నెట్ వర్క్, సరఫరా, వినియోగంపై చర్చించారు. భవిష్యత్తు ప్రణాళికలు, కార్యాచరణను వివరించారు.
ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నాయన్న సీపీ.. గంజాయి వినియోగం ఉన్న ప్రాంతాలను గుర్తించి దృష్టి సారించాలన్నారు. సప్లయర్స్ చైన్ ను బ్రేక్ చేస్తే మత్తులో జరిగే నేరాలను అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెప్పారు. డ్రగ్ అడిక్టర్స్ కు కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావాలన్నారు. మాదకద్రవ్యాల స్మగ్లర్లు, వినియోగదారుల వివరాలు సేకరించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేయాలని ఆదేశించారు. తరచుగా పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు స్టీఫెన్ రవీంద్ర.