వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాన్ పెను తుపానుగా మారింది . దీనికి ఆంఫాన్ తుపాన్ గా నామకరణం చేశారు. దీనిపై సాయంత్రం 4గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు, హోమ్ మంత్రి అమిత్ షా ,ఎన్‌డీఎంఏ అధికారులు కూడా హాజరౌతారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు గండం పొంచి ఉంది. దీంతో ముందు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రధానితో సమావేశానంతరం అధికారులు ప్రకటన విడుదల చేసే అవకాశముంది.
ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 1,040 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌కు నైరుతి దిశలో 1,200 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైన ఆంఫన్ మరింత వేగంగా బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తుఫాను… వాయవ్య దిశలో వెళ్తూ… బుధవారం బెంగాల్‌లోని సాగర్ దీవులు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంలో గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని… సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పోర్ట్‌లు నిజాంపట్నం, కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నంలో రెండో ప్రమాద హెచ్చరికను ఇప్పటికే జారీ చేశారు.ఏపీ కంటే ఒడిశా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ భారీ వర్షాలు కురవొచ్చంటున్నారు.
తెలంగాణలో కూడా అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులతో చిన్న పాటి వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.