మాండౌస్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మాండూస్ తుఫాన్ తీరం దాటినట్టు ఐఎండీ పేర్కొంది.
ఆ సమయంలో రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు చెంగల్‌పట్టు, విల్లుపురం, కాంచీపురం, కరైకల్, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంబాలు నెలకొరగడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఈ తుఫాన్ శనివారం మధ్యాహ్నం వరకు మరింత బలహీన పడి వాయుగుండగా మారుతుందని వెల్లడించింది.
తుఫాన్ నేపథ్యంలో చెన్నై, చెంగల్‌పట్టు, కరైకల్, మహాబలిపురం, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజధాని చెన్నైలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలాశయాలను తలపించాయి. ఈ క్రమంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షాలకు చెన్నై టీ-నగర్‌లో గోడ కూలిన ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
ముందస్తు చర్యల కింద తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ చర్యలు అందించేందుకు రెడీగా ఉండాలని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సూచించింది. పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారలు సూచించారు.