మాండౌస్ దూసుకు వస్తోంది. తుపాన్ తమిళనాడు తీరానికి సమీపంలోకి చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ ఈ అర్ధరాత్రి వరకు తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే ఈ మేరకు చర్యలు చేపట్టింది. సహాయక చర్యలను చేపట్టేందుకు యంత్రాంగాన్ని ఇప్పటికే రెడీ చేసింది. చెన్నైలో మాండౌస్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు విపత్తు సహాయక బృందాలు సిద్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆదేశాలు రాగానే విపత్తు నిర్వహణ బృందాలు, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగుతాయని అధికారులు చెప్పారు. ఇక తుఫాన్ కారణంగా చెన్నై విమానాశ్రయంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు పది విమానాలను రద్దు చేశారు. మరో 13 విమానాలను దారి మళ్లించారు.
ఇక పలు రైళ్లు, బస్ సర్వీసులు సైతం పాక్షికంగానే నడిచాయి. తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.