పాండిచ్చేరి, తమిళనాడుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నివర్.. తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో కుండపోత కురుస్తున్నాయి. తిరుమలలో అయితే రాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. బలమైన గాలులకు చెట్లు విరిగిపడుతున్నాయి.
ఇటు తెలంగాణపైనా నివర్ ప్రభావం చూపిస్తోంది. నేడు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్తోంది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
నివర్ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులను ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి.