అసని తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. కెరటాలు ఎగిసి పడుతున్నాయి. తీవ్ర తుపానుగా కొనసాగుతున్న అసని నేడు బలహీనపడే అవకాశమున్నట్లు వాతావరశాఖ వెల్లడించింది. వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపింది. తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించవచ్చునని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
తుపాను ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుపాను కారణంగా తీరం వెంబడి ప్రాంతాల్లో గంటకు 40 కిలో మీటర్ల నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
అలాగే, గంటకు 12 కిలోమీటర్ల వేగంతో అసాని తీవ్ర తుపాన్ పయనిస్తుంది. కాకినాడకు 330 కిలోమీటర్లు, విశాఖకు 350 కిలోమీటర్లు, పూరికి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని ఆనందపురం, అచ్యుతాపురం మండలాల్లో గాలుల తీవ్రతకు పలు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. వాటిని సరిచేసి, విద్యుత్తు పునరుద్ధరణ చర్యలు తీసుకున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ మహేంద్రనాథ్ తెలిపారు.
మరోవైపు బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్ర తుపాను కారణంగా పలు విమాన సర్వీసులు తాత్కలికంగా రద్దయ్యాయి. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి విశాఖకు సోమవారం మధ్యాహ్నం నుంచి వచ్చిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలాసేపు గాలిలో చక్కర్లుకొట్టి వెనుదిరిగాయి. అలాగే, మొత్తం 23 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఉదయం ఇండిగో సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఏషియాకు చెందిన ఢిల్లీ-విశాఖపట్నం, బెంగళూరు- విశాఖపట్నం విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఎయిరిండియాకు విమానాలు సైతం రద్దయ్యాయి. తుపాను నేపథ్యంలో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తమైంది.
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై ‘అసని’ ప్రభావం అధికంగా కనిపించింది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం, కోనపాపపేట గ్రామాలపై అలలు ఎగసి పడుతున్నాయి. పలువురి ఇళ్లు కోతకు గురై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వరకున్న బీచ్ రోడ్డుపైకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో వాహనాల రాకపోకలను నిలిపేశారు. అలాగే, రుషికొండ, సాగర్‌నగర్ ప్రాంతాల్లో సముద్రం కొంత ముందుకు వచ్చింది. గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల 15-20 అడుగుల వరకు అలలు ఎగిసిపడ్డాయి.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో గతేడాది నవంబరు 19న అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో పులపుత్తూరు గ్రామం అతలాకుతలమైంది. వరదలో ఇళ్లు, నగలు, నగదుతోపాటు సర్వం కోల్పోయిన సుమారు 200 బాధిత కుటుంబాలు తాత్కాలికంగా గుడిసెలు, షెడ్లు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వీస్తున్న బలమైన ఈదురు గాలుల తాకిడికి రేకులు, గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. దాంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. అలాగే, చెట్టు కొమ్మ విరిగిపడి మహిళ మృతి శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలుల కారణంగా మహిళ దుర్మరణం పాలైంది. తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గాలుల తీవ్రత పెరిగింది. పోలాకి మండలం నందిగాంలో ఎడ్ల లక్ష్మి(45) అనే మహిళ సరకుల కోసం రేషన్ వాహనం వద్దకు రాగా ఆమెపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువతికి గాయాలయ్యాయి.