సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటూ.. అంబానీ, అదానీతోనే మోడీ ఉంటారని సెటైర్లు వేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతదేశం ప్రమాదకర స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అతిపెద్ద ముప్పుగా మారాయని ఆరోపించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాయని అన్నారు రాజా. ఈ రెండింటి సిద్ధాంతాలను ప్రజలపై బలవంతగా రుద్దుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని వివరించారు.
దేశానికి బీజేపీ ప్రమాదకారిగా తయారైందని విమర్శించారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. దేశం ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభంలో ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అంటే పోరాటాల గడ్డ అని.. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను తలుచుకుని జోహోర్లు తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం కనీస అవసరాలని, ఈ రంగాల్లో తెలంగాణ ముందుందని కొనియాడారు. కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న రాజా.. రైతుబంధు, దళితబంధు లాంటి అద్భుత పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు.