బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమాపై హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. దబాంగ్ 3 సినిమాలోని పాటతో పాటు కొన్ని సన్నివేశాల్లో సాధువులను కించపర్చారని, వాటిని ఈ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. డిసెంబరు 20వతేదీన దబాంగ్ 3 సినిమా విడుదల చేయనున్నందున సాధువులను కించపర్చే సన్నివేశాలు, పాటను తొలగించాలని ముంబై సెన్సార్ బోర్డ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను హిందూ జాగృతి సమితి కోఆర్డినేటర్ సునీల్ ఘన్వాట్ డిమాండ్ చేశారు. ఈ సినిమా నుంచి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకుంటే తమ కార్యకర్తలు సినిమా హాళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తారని సునీల్ హెచ్చరించారు. సినిమాలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాలు హీరో హీరోయిన్ లుగా నటించారు. 2012 వచ్చిన దబాంగ్ 2 కు ఇది సీక్వెల్. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్బాజ్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ ప్రభుదేవా.