ఆ చిన్నారి ఆటల్లో తన సత్తా చాటి రెండు బంగారు పతకాలు సాధించింది. వాటిని తీసుకునేటప్పుడు ఒక్కసారిగా ఆ బంగారు తల్లి కన్నీటి పర్యంతమైంది. పతకాలు సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు అనుకున్నారు అందరూ.
కానీ.. ఆ కన్నీటి వెనుక ఆ చిన్నారి తల్లికి తీర్చలేని వేదన ఉంది. కన్నా తండ్రిని తలచుకుంటూ ఆ చిట్టి తల్లి కాళ్ళ నీళ్లు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారి గుండెలను ద్రవింప చేస్తుంది.
ఇంతకీ ఎవరు ఆ చిన్నారి.. ఎవరు తండ్రి అంటే.. ఐదురోజుల క్రితం గొత్తికోయలో దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు గారాలపట్టి కృతిక. కొత్తగూడెంలోని కార్పొరేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా అథ్లెటిక్స్‌లో కఠోర శిక్షణ పొందుతోంది. తండ్రి చనిపోయిన బాధ మనసును తొలుస్తున్నా శుక్రవారం కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో నిర్వహించిన అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జిల్లాస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో కృతిక పాల్గొని సత్తా చాటింది.
లాంగ్‌జంప్ అండర్-10 విభాగంలో ప్రథమ బహుమతి, 50 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ బహుమతి సాధించింది. పతకాలు అందుకుంటున్న సమయంలో తండ్రిని గుర్తుచేసుకొని రోదించడం అక్కడున్నవారిని కలిచివేసింది. కూతురు కృతిక అథ్లెటిక్స్‌లో మంచి గుర్తింపు పొందాలనేది శ్రీనివాసరావు కల.
నిత్యం సింగరేణిలోని ప్రకాశం మైదానానికి కూతురును ఆయనే స్వయంగా తీసుకొచ్చేవారు. ఐదురోజుల క్రితం కూడా తండ్రి, తనను మైదానానికి తీసుకొచ్చి దగ్గరుండి ప్రాక్టీసు చేయించారని.. కొన్ని మెళకువలు చెప్పారని కృతిక గుర్తుచేసుకుంది. ఎన్నికష్టాలొచ్చినా మనో ధైర్యంతో చివరి క్షణం దాకా పోరాడితేనే ఏ పోటీలోనైనా నెగ్గుతావు అంటూ తండ్రి తనతో చెప్పేవారని పేర్కొంది.