రాజకీయ త్రిశంకు స్వర్గం - Tolivelugu

రాజకీయ త్రిశంకు స్వర్గం

పూలమ్మిన చోటే కట్టెలమ్ముతారు.. ఇది పాత సామెత ! కానీ కొన్ని దశాబ్దాలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఎన్టీఅర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ఎందరో సాధారణ, సీనియర్  లీడర్లకు రాజకీయ భవిష్యత్ చూపిన దగ్గుబాటి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ త్రిశంకు స్వర్గంలో పడి అయోమయ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సూటిగా వేసిన ఒక ప్రశ్న దగ్గుబాటికి పజిల్ గా మారింది. పురందేశ్వరి బీజేపీని వీడాలి..సకుటుంబ సమేతంగా వైసీపీలో ఉండాలి.. లేదంటే…? అని జగన్ సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వేసిన ప్రశ్నకు ఏ సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.

మొన్నటి ఎన్నికలకు ముందు  పురందేశ్వరి బీజేపీలో ఉండగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేశ్‌ వైసీపీలో చేరినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందన్నదే దగ్గుబాటి సందేహం.  గత ఎన్నికల్లో దగ్గుబాటికి పర్చూరు టికెట్‌ వచ్చినా రాజకీయ, ఆర్ధిక కారణాలతో విజయం సాధ్యం కాలేదు. ఆతర్వాత పర్చూరు వైసీపీ ఇన్ చార్జ్ గా  దగ్గుబాటి రాకతో కొంత ఊరట లభించింది. కానీ అధికారం వచ్చాక నాయకత్వంలో సహజంగా మార్పులు వస్తాయి. ఎంతటి సీనియర్ అయినా అధినేత మెప్పు పొందలేకపోతే షాక్ తప్పదు. ఇప్పుడు దగ్గుబాటికి అదే పరిస్థితి ఎదురైంది.

ఎన్నికలకు ముందు పర్చూరు వైసీపీ ఇన్ చార్జ్ రావి రామనామథంబాబు దగ్గుబాటి వైసీపీలోకి రాగానే అలిగి టీడీపీలో చేరగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రావి రామనామథంబాబు మళ్ళీ ఇటీవల వైసీపీలోకి రావడంతో దగ్గుబాటికి కష్టకాలం దాపురించింది. ఇది దగ్గుబాటి రాజకీయ ఆవేదనకు కారణమైంది.

ఎంతో ఆపసోపాలు పడి చివరికి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జోక్యంతో దగ్గుబాటికి జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరికింది. దగ్గుబాటి తన కుమారుడితోపాటు సీఎంను కలిశాక అసలు సవాల్ ఎదురైంది. పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలన్న జగన్‌ కండిషన్ దగ్గుబాటికి సంకటంగా మారింది.

ఈ పరిస్థితుల్లో దగ్గుబాటి ఏమి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికలిగిస్తోంది. పురందేశ్వరి బీజేపీని వీడే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఎందుకంటే మోడీ నాయకత్వంలో పనిచేయడానికి ఎందరో నేతలు ముందుకు వచ్చి బీజేపీలోకి చేరుతున్న తరుణంలో కీలక స్థానంలో ఉన్న పురందేశ్వరి బీజేపీని వదిలి బయటికి వచ్చినా, వైసీపీలో చేరినా నష్టమే తప్ప అంతగా రాజకీయ లాభం ఏమాత్రం ఉండదనేది స్పష్టం. ఇప్పుడు దగ్గుబాటి రాజకీయ భవిష్యత్ ఏమిటి? వైసీపీలోనే కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తాను కూడా బీజేపీలోకి వెళ్ళడమా? రాజకీయ సన్యాసం చేయడమా? అనేది తేలాల్సి ఉంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp