భార్య చనిపోయి రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారు, పెళ్లికాని యువకులే ఆమె టార్గెట్. పథకం ప్రకారం వారితో ముందుగా పరిచయం ఏర్పరుచుకునేది. తియ్యని మాటలతో వారిని తన వలలో వేసుకుని.. వారి పరిచయాన్ని పెళ్లి వరకు తీసుకువచ్చేది. తీరా వివాహం అయ్యాక మొదటి రాత్రే భర్తకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోని నగలు, డబ్బుతో ఉడాయించడం ఆమె ప్లాన్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లిచేసుకుంది. అనుమానం వచ్చిన నాలుగో భర్త పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
హర్యానాలో ఓ యువతి యువకులకు గాలం వేసి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత మొదటిరాత్రే మత్తుమందు ఇవ్వడం.. డబ్బు, నగలతో పారిపోవడం.. ఇలా అక్రమార్జనకు అలవాటు పడింది. ఇందు కోసం ఆమె విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని, పెళ్లికాని యువకుల్ని లక్ష్యంగా చేసుకునేది. భర్తకు అనుమానం వచ్చేలోపే తన ప్రణాళికను అమలు చేసేది. ఒకవేళ అలా పారిపోవడం కుదరకపోతే పెళ్లైన పదిరోజుల్లోనే కట్నం వేధింపులు చేస్తున్నారంటూ భర్తను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేది.
అయితే, ఆ యువతిపై మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె నాలుగో భర్త నౌల్తాకు చెందిన రాజేందర్ పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకుని ఆ యువతి ఐదో భర్త దగ్గరకు వెళ్లాడు. వారు ఆమె నిజస్వరూపాన్ని పసిగట్టేలోపే శనివారం ఏడో వివాహం కూడా చేసేసుకుంది. వీరు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ యువతిని, ఆమె సహచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్‌ను ఈ యువతి మొదటగా పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తండ్రి అయిన సతీష్ రెండో వివాహంగా పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం జనవరి 1న రాజస్థాన్‌లో జరిగింది. ఆధార్ కార్డ్‌లో తండ్రి పేరు మార్చి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. ఫిబ్రవరి 15న మూడో వివాహం.. ఫిబ్రవరి 21న నాలుగో వివాహం రాజేందర్‌తో.. ఐదో వివాహం కుటానాకు చెందిన గౌరవ్‌తో.. ఆరో వివాహం కర్నాల్‌కు చెందిన సందీప్‌తో జరిగింది. చివరగా మార్చి 26న (శనివారం) బుద్వాకు చెందిన సుమిత్తో అంజూకు ఏడో పెళ్లి జరిగింది.