బౌద్ధ మతాన్ని నాశనం చేయాలని చైనా ప్రయత్నిస్తోందని టిబెటియన్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రయత్నాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా విజయం సాధించబోదని పేర్కొన్నారు. బిహార్‌లోని బుద్ధ గయ, కాలచక్ర మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బౌద్ధ మత ధర్మం పట్ల తమకు బలమైన నమ్మకం ఉందన్నారు. హిమాలయాల పర్యటన సమయంలో అక్కడి స్థానికులు అత్యంత భక్తి శ్రద్దలతో బౌద్ధాన్నిపాటించడాన్ని తాము గమనించానని చెప్పారు. చైనా, మంగోలియాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
కానీ బౌద్దాన్ని విషపూరిత మతంగా చైనా భావిస్తోందన్నారు. అందుకే ఆ మతాన్ని నాశనం చేసేందుకు పద్ధతి ప్రకారం ప్రయత్నాలు చేస్తోందన్నారు. చైనా నుంచి బౌద్ధాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు చైనా ప్రయత్నిస్తోందన్నారు. ఆ మతానికి సంబంధించిన వ్యవస్థలను ధ్వంసం చేస్తోందన్నారు.
కానీ బౌద్దాన్ని నాశనం చేయడంలో చైనా విఫలమైందన్నారు. బౌద్ధ ధర్మానికి చైనా ప్రభుత్వం హాని చేసిందన్నారు. కానీ నాశనం మాత్రం చేయలేకపోయిందని వెల్లడించారు. అనేక బౌద్ధ విహారాలను చైనా ధ్వంసం చేసిందన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో బౌద్ధాన్ని అవలంబించేవారి సంఖ్య తగ్గడం లేదన్నారు.
బౌద్ధ మతం, తన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించేవారు తన బోధిస్తున్న బోధిచిత్తను కూడా అంగీకరించాలని సూచించారు. అది టిబెట్ కావచ్చు లేదా మంగోలియన్, చైనా కావచ్చు దాన్ని అంగీకరించాలన్నారు. చైనాలో అనేక బౌద్ధ ఆరామాలు ఉన్నాయని చెప్పారు.
చైనాకు తాను చాలా సార్లు వెళ్లానని వివరించారు. అక్కడ ఇప్పటికీ అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు బౌద్ధాన్ని విశ్వసిస్తున్నారని, వారి మనసుల్లో బౌద్ధం ఉందననారు. బౌద్ధంతో వారికి గొప్ప అనుబంధం ఉందన్నారు. చైనీయులకు బౌద్ధంతో పురాతన సంబందాలు ఉన్నాయన్నారు.