సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఫాం లేని కారణంగా జట్టుకు ఎంతో కాలం నుంచి దూరమయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. కానీ అవకాశం ఇచ్చినా అతను రాణించకపోవడంతో అతను ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఇక ప్రస్తుతం అతను శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో క్యాండీ టస్కర్స్ టీంకు ఆడుతున్నాడు. కానీ అతను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు.
అయితే డేల్ స్టెయిన్ తన ఖాళీ సమయంలో తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. వారు ట్విట్టర్‌లో అడిగిన పలు ప్రశ్నలకు డేల్ స్టెయిన్ సమాధానాలు చెప్పాడు. కానీ ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు మాత్రం స్టెయిన్ కోపం తెచ్చుకున్నాడు.
డేల్ స్టెయిన్ ఎప్పుడూ షార్ట్ హెయిర్‌తో దర్శనమిచ్చేవాడు, కానీ ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో వెంట్రుకలు బాగా పొడవు పెంచుకుని కనిపించాడు. అయితే ఇదే విషయమై ఓ ఫ్యాన్ స్టెయిన్‌ను అడిగాడు. డేల్.. లాంగ్ హెయిర్ మీకు బాగాలేదు, షార్ట్ హెయిర్ ఓకే, హెయిర్ కట్ చేయించుకోండి.. అంటూ సూచించాడు. అయితే అందుకు స్టెయిన్ కు కోపం వచ్చింది. దానికి స్టెయిన్ కోపంగా రిప్లై ఇచ్చాడు.
నా లుక్ ఎలా ఉండాలన్న విషయంపై నేను ఆందోళన చెందుతా, మీ లుక్ గురించి మీరు పట్టించుకోండి, మిస్టర్ అగ్లీ ముస్టాచ్.. అని స్టెయిన్ తిట్టినట్లు రిప్లై ఇచ్చాడు. అయితే ఆ ఫ్యాన్ ఏమీ బాధపడలేదు. వెల్, నాకు స్టెయిన్ నుంచి రిప్లై వచ్చింది, అది నాకు బిగ్ అచీవ్‌మెంట్, చాలు, థ్యాంక్స్ అని ఆ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు.
కాగా స్టెయిన్ ఆడుతున్న ఎల్‌పీఎల్ క్యాండీ టస్కర్స్ జట్టు సతమతం అవుతోంది. ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఆ టీం స్టెయిన్‌ను త్వరగా క్యారంటైన్ ముగించుకుని జట్టులోకి రావాలని ఆశిస్తోంది.