బంగారు తెలంగాణ పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలేమి ప్రజలకు సక్రమంగా అందడంలేదని అంటున్నారు ప్రతిపక్షనాయకులు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం అని చెప్పుకునే పాలకులు ప్రజలకు ఫథకాలను చేరవేయడంలో విఫలం అవుతున్నారని అంటున్నారు. వాటిలో ముఖ్యంగా దళిత బంధు విషయంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
దళితబంధు పథకం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఎలాగైన గెలవాలనే ఉద్దేశ్యంతో.. ఓ సభలో రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి రూ. 10 లక్షలు అందిస్తామని నోరు జారారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే.. నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ లుగా ప్రకటించారు. అయితే.. పిల్లికి బిచ్చం వేసినట్టు అరకొరగా దళితుల అకౌంట్లలో డబ్బులు జమ చేసి.. అరచేతిలో వైకుంఠం చూపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా.. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోనూ దీనిక సంబంధించి అగ్గిరాజుకుంటోంది. అర్హులైన వారిని పక్కన పెట్టి.. ప్రజాప్రతినిధుల అనుచరులకు దళిత బంధును అందించారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. నియోజకవర్గంలోని బెజ్జంకి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేకాధికారి ఓబులేసు సారథ్యంలో దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా చీలాపూర్ పల్లి, నర్సింహులపల్లి గ్రామాలను మాత్రమే పైలట్ ప్రజెక్ట్ లుగా తీసుకొని.. ఈ రెండు గ్రామాల నుండి 18 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు ఓబులేసు ప్రకటించారు.
పైలట్ ప్రాజెక్టులు అనుకుంటూనే.. ఆ రెండు గ్రామాలకు సంబంధంలేని బేగంపేట గ్రామానికి చెందిన ఎమ్మెల్యే అనుచరుడి పేరును దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా చేర్చడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సైతం స్థానిక ఎమ్మెల్యే కనుసన్నలో పని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అనర్హులను పేర్లను లబ్ధిదారుల జాబితానుండి తొలగించి.. అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేస్తున్నారు.