తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారుతాయనుకున్న దళితులకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు. భూ కబ్జాకోరుల చేతిలో బలికాక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దళితుల భూములు కబ్జాలకు గురవుతున్నాయంటున్నారు. అధికార పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
తాజాగా.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ టీఆర్ఎస్ నాయకుడు గద్దె రవి ఇంటి ముందు ఓ దళిత మహిళ నిరసనకు దిగింది. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించిన కొందరికి అండగా ఉంటూ.. తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తోంది.
బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బజారులో తనకున్న కొద్ది పాటి భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అందులో భాగంగా బోరు వేస్తుండగా టీఆర్ఎస్ నాయకులు గద్దె రవి అనుచరులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది.
రవి భార్య కౌన్సిలర్ కావడంతో పదవిని అడ్డం పెట్టుకొని మాటి మాటికి తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది. తన దగ్గర ఆ స్థలానికి సంబంధించి పత్రాలన్నీ ఉన్నాయని.. అయినా అధికారులెవరు పట్టించుకోవడం లేదని దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులు విచారణ చేపట్టి తనకు న్యాయం జరిగేటట్టు చూడాలని వేడుకుంటోంది.