దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం దళితబంధు తీసుకొచ్చామని టీఆర్‌ఎస్ ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తమకు అనుకూలమైన వారికే ముందస్తు లబ్ధి చేకూరుతోందని పలు సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా నిధులకు సంబంధించిన నిర్లక్ష్యం బయటపడింది.
రూ.1.5 కోట్ల దళిత బంధు నిధులు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. బ్యాంకులో తలెత్తిన లోపం వల్ల ఇది జరుగిందని చెబుతున్నారు. మొత్తం 15 మంది ఖాతాల్లోకి రూ.10 లక్షల చొప్పున రూ.1.5 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. అదే బ్యాంక్ లో ఖాతాదారులైన లోటస్ హాస్పిటల్ లో పని చేస్తున్న ఉద్యోగుల అకౌంట్స్ లోకి ఈ దళిత బంధు డబ్బులు వెళ్లాయి.
దాదాపు 15 రోజుల తరువాత ఈ తప్పిదాన్ని గుర్తించారు బ్యాంక్ అధికారులు. 14 మంది దగ్గర డబ్బులు రికవరీ చేశారు గానీ.. కృష్ణ అనే వ్యక్తి మాత్రం మొత్తం డబ్బులు వాడుకున్నాడు. అకౌంట్ లో భారీగా డబ్బులు పడడంతో అతను వాటన్నింటిని తన సొంత ఖర్చులకు వినియోగించాడు. దీంతో సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు బ్యాంకు అధికారులు.
దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎస్సీ కార్పొరేషన్ దళిత బంధు నిధులను రంగారెడ్డి జిల్లా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని.. లక్డీకపూల్ లోని ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేశారు.