తమిళనాడులో చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. సుమారు 8 దశాబ్దాల తర్వాత ఓ ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించారు. సుమారు 300 మంది ఎస్సీలు ఆలయంలోకి ప్రవేశించారు. వారంతా ఆలయంలో పూజలు చేసి ఆనందంతో పొంగిపోయారు.
ఆలయంలోకి వెళ్లేందుకు వచ్చిన వారిని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు నిలువరించారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇన్నేళ్లుగా దళితులకు ఆలయ ప్రవేశం లేని విషయం పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో బయటకు వచ్చింది.
తిరువణ్ణామలై జిల్లాలో తెన్ముడియనూర్‌లో 200 ఏండ్ల నాటి ఆలయం ఉంది. ఆ గ్రామంలో నివసించే 500 ఎస్పీ కుటుంబాలకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు. దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. దీన్ని మార్చేందుకు కూడా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు.
తాజాగా ఈ ఆలయంలోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నం చేశారు. దీంతో వారిని మరొక వర్గం అడ్డుకున్నది. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో ఆలయాన్ని మూసి వేయాలని మరో వర్గం వారు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు నిలువరించారు. దీంతో ఆలయంలో ఎస్సీలు ప్రవేశించి అమ్మవారికి పూజలు చేశారు.