హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ దళిత బంధు పథకంతో లబ్ధి పొందాలని అనుకున్న కేసీఆర్ కు షాక్ మీద షాకిస్తున్నారు దళితులు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఇల్లందకుంటలో భారీ ర్యాలీ తీశారు దళితులు. 470 మంది దరఖాస్తు చేసుకుంటే 40 మందిని ఎంపిక చేయడమేంటని మండిపడ్డారు. పైగా ఆ 40 మందిలోనూ ఎక్కువ శాతం స్థానికులు లేరని.. బయటివారే ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు తమకు ఇష్టమైన వారినే ఎంపిక చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యలో దళితులు పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దళిత బంధు అనర్హులకి కూడా కేటాయించారని ఆరోపిస్తూ కరీంనగర్ – వరంగల్ హైవేపై బైఠాయించారు.
నర్సింగపూర్ గ్రామ దళితులు అందరికీ పథకాన్ని అమలు చేయాలని హుజూరాబాద్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు.
జమ్మికుంట మండలంలోని వేంకటేశ్వర పల్లిలో కూడా దళిత బంధు అందరికీ ఒకేసారి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు దళితులు.
ఇక హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అందరికీ దళిత బంధు ఇవ్వాలని జాతీయ రహదారిపై నిరసన తెలిపారు దళితులు.
ఇలా చాలాచోట్ల ఇవాళ దళిత బంధుపై దళితులు తమ నిరసనను తెలియజేశారు. కేవలం హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని తెచ్చారని… రాష్ట్రంలోని అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.