సమాజంలో కుల వ్యవస్థ బలంగా అల్లుకుపోయిందని అన్నారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి. హదరాబాద్ సరూర్ నగర్ లో నడిరోడ్డుపై హత్యచేయబడిన నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగరాజు చిత్ర పటానికి పూలమాలలేసి నివాలులర్పించారు. బాధితుని భార్య అశ్రిక్ సుల్తానా, తల్లిదండ్రులు శ్రీనివాస్, అనసూయ, చెల్లి రమాదేవిలతో మాట్లాడి.. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల పట్ల చులకన భావం, వివక్షల కారణంగానే రాష్ట్రంలో పరువు హత్యలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మతాల్లో దళితులను అంటరాని వాళ్లుగా.. తక్కువ జాతి వాళ్లుగా చూస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకు మనువాద భావజాలం పెరిగిపోతోందని పేర్కొన్నారు మురళి. దీంతో దళితులపై హింస, హత్యలు పెరుగుతున్నాయన్నారు. సామాన్య ప్రజలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. నడిరోడ్డుపై నాగరాజును హత్య చేస్తున్నా.. చూస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారే తప్ప.. రక్షించాలని ఒక్కరూ ప్రయత్నించకపోవడం బాధాకరమన్నారు.
మనుషుల్లో మానవత్వమే కరువైపోయందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హత్యకు కారణం అయిన నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుని భార్యకు, చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. కులం, మతం అనే విభేదాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ఆకునూరి మురళి.