తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ పై దళితులు ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదేంటి దళిత ఎమ్మెల్యేపై దళితులు ఆగ్రహంగా ఉండడం ఏంటని అనుకుంటున్నారా..? అవును నిజమే. ఎందుకంటే.. తుంగతుర్తిలో తక్షణమే దళిత బంధు పథకం అమలవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అవసరమైతే ఎమ్మెల్యే రాజీనామా చేసయినా ఈ పథకాన్ని అమలయ్యేలా చేయాలని అడుగుతున్నారు దళితులు. కిషోర్ తమ అభ్యున్నతి మరిచి తన అభివృద్ధిపై దృష్టి పెట్టుకొని ఇసుక దందా, భూదందా సహా ఇతర దందాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్, రెవెన్యూ అధికారుల పోస్టింగ్స్ తోపాటు ఇతర సెటిల్ మెంట్స్ చేస్తూ కిషోర్ కోట్లు దండుకుంటున్నారని అంటున్నారు దళితులు. నయీం బతికున్నప్పుడు భేటీ అయ్యారని.. ఆ తర్వాత దందాలకు తెరలేపారని.. నయీం పోలీసుల చేతిలో హతమయ్యాక కిషోర్ దందాలు విపరీతంగా పెరిగాయని ఆరోపిస్తున్నారు. అయినా.. నల్గొండ నుంచి వచ్చి తమపై పెత్తనం చేయడమేంటని నిలదీస్తున్నారు స్థానిక దళితులు. తనను వ్యతిరేకించే వారిపై దాడులు చేయించడం.. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా కేసులు పెట్టించడం చేయిస్తున్నారని అంటున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని తన ఇష్టారాజ్యంగా గ్యాదరి వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు దళితులు.
తమ అధినాయకుడు కేసీఆర్ మెప్పు కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారని.. మాదిగలు కిషోర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటు పడిన ప్రవీణ్ కుమార్ పై నోరు పారేసుకోవడంపై మండిపడడమే కాకుండా… సామాజిక కోణంలోనూ చర్చ జరుపుతున్నారు. గ్యాదరి మాదిగ వ్యతిరేకి అని అంటున్నారు. అందుకే ప్రవీణ్ పై విమర్శలు చేయడమే కాకుండా మాదిగ నాయకులపై దాడులు చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు. తుంగతుర్తిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఈసారి మాదిగలు ఎవరూ ఒక్క ఓటు కూడా కిషోర్ కు వేయరని అంటున్నారు. ఊరూరా దండోరా వేయిస్తామని… కిషోర్ దుర్మార్గాలను ఆపకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.