- ఫ్రీ స్కీమ్స్, తాయిలాలతో ప్రమాదం
- ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్న ప్రభుత్వాలు
- ప్రధాని వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటి..?
- ఏపీ, తెలంగాణలో పథకాల తీరుపై కన్నెర్ర..!
ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు ఒకే షార్ట్ కట్ ను ఎంచుకుంటున్నాయి. అవే ఉచిత హామీలు. నగదు బదిలీ దగ్గర నుంచి అనేక పథకాల కింద నిత్యావసర వస్తువులు సహా సమస్తం ఇస్తామని హామీలిస్తూ గద్దెనెక్కిన తర్వాత అనేక తంటాలు పడుతుండటం పరిపాటైంది. ఉచిత పథకాలు, తాయిలాలతో అభివృద్ధి సాధ్యమా అంటే చాలావరకు అసాధ్యమనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కష్టపడి సంపాదించుకునే తత్వం నుంచి సోమరితనం ఆపాదించే విధంగా ప్రభుత్వాలు తాయిలాలు ప్రకటించడం ఆహ్వానించదగినది కాదని చెబుతున్నారు.
సంక్షేమ పథకాలు.. ఉచిత పథకాల పేరుతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రజలకు అప్పులు చేసి మరీ డబ్బులు పంచుతున్న విషయం తెలిసిందే. దీనికి నవరత్నాలు అని పేరు కూడా పెట్టింది. అయితే.. తాజాగా మోడీ ఈ సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉచిత పథకాలు అమలు చేయడం.. అంటే.. షార్ట్కట్ రాజకీయాలని, దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని అన్నారు. వాటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ ఖాయమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత.. ఆయన ఎవరిని ఉద్దేశించి ఇలా అన్నారో అనే చర్చజరుగుతోంది. ఇటీవల ఆయన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పర్యటించారు. తర్వాత.. ఇప్పుడు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇలా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే పరోక్షంగా ఆయన టీఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాలను టార్గెట్ చేశారా? అనే చర్చ జరుగుతోంది. జార్ఖండ్ లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వనరుల పట్ల చిత్తశుద్ధి మరిచి ఖర్చు చేయడంపై ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు, నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక తాహతుకు మించి హేతుబద్ధత మరిచి ఆయా రంగాలకు ఇష్టానురీతిగా ఖర్చు చేయడంతో రెవెన్యూ లోటుకు కారణమవుతోంది. రుణమాఫీ, పాత పింఛను విధానం, వివిధ సెక్షన్ల ప్రజలకు వరాలివ్వడం.. ఇలాంటి సంక్షేమాలన్నీ చివరకు ఆర్థిక రంగంలో ఉపద్రవానికి దారితీస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో పన్నులు, మైనింగ్ లాంటి రూపాల్లో సమకూర్చుకుంటున్న ఆదాయ వనరుల్లో సంక్షేమానికి ఖర్చు చేసేది 63% ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమానికి, అనుత్పాదక అవసరాలకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోడానికి దోహదపడదని, భవిష్యత్తులో ఆర్థిక విపత్తుకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఉచిత పథకాలతో ఆదాయ వనరులు తగ్గిపోవడంతో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో సమకూర్చుకోడానికి రాష్ట్రాలు తిప్పలు పడుతున్నట్లు వాటి బడ్జెట్‌లను చూస్తే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఒక హెచ్చరికగా భావించవచ్చు.
ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ఉచిత పథకాలను అమలు చేస్తున్నాయి. అంధ్రప్రదేశ్ లోనూ ఈ పథకాల సంఖ్య ఎక్కువే. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నెడుతున్నాయనే అపవాదును జగన్ సర్కారు మూటగట్టుకుంటోంది. గతంలో అత్యధిక రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్‌లో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ లోటు ఏర్పడిందని సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ వంటి ఉచిత పథకాల వల్ల ఏపీలో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.
మొత్తానికి అధికారమే పరమావధిగా ఆయా రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్న ఉచిత పధకాలు ప్రభుత్వ ఖజానాలను ఖాళీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో సంక్షేమ పథకాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో పేదల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నా.. దీని వెనుక ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు లక్షల కోట్ల రూపాయల అప్పులు, అప్పులపై చెల్లించవలసిన వడ్డీ ఏటికేడు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.