టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. కొండగట్టులో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేస్తోంది పాదయాత్ర కాదని ఎద్దేవ చేశారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసింది పాదయాత్రనా..లేక బస్సు యాత్రనా..అనేది జనాలకి ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టుని అభివృద్ధి చేసిందని రేవంత్ రెడ్డి చెప్తున్నారని, అసలేం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కొండగట్టుకి వెయ్యి కోట్లు కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ‘బలి దేవత’ గా అభివర్ణించారని రవిశంకర్ గుర్తు చేశారు. ఇప్పటికీ చంద్రబాబు బినామీగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బస్సులో పాదయాత్ర చేస్తున్నాడని, ఈ యాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు.
జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు.. కొండగట్టుకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం నీటితో చొప్పదండి నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యిందన్నారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదని, అసలు ఎలాంటి సమాచారమూ అందించడం లేదని పేర్కొన్నారు. రేవంత్ కు దళితులంటే అస్సలు గౌరవం లేదన్నారు.