గణతంత్ర దినోత్సవాలను పురస్కారించుకుని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో గురువారం జరిగిన డేర్ డెవిల్స్ టీమ్ నిర్వహించిన డేరింగ్ మోటార్ సైకిల్ ఫీట్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఒక్కో జట్టు ఒక్కో విధంగా కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ కి చెందిన వీరి విన్యాసాలు క్షణంకూడా కళ్ళు ఆర్పకుండా చేశాయి.
తొమ్మిది బైకులపై 33 మంది మానవ పిరమిడ్ ఆకారంలో చేసిన ఫీట్ వావ్ అనిపిస్తే.. వీరిలో కొందరు మహిళలు కూడా ఉండడం మరింత అబ్బురమనిపించింది. ఈ టీమ్ లోని మహిళా అధికారి, జోధ్ పూర్ కి చెందిన లెఫ్టినెంట్ డింపుల్ భాటి తన నేతృత్వంలో చేసిన ఫీట్ మెస్మరైజ్ చేసింది.
ఒకే మోటార్ బైక్ పై సూర్యనమస్కారాలు చేస్తూ హవల్దార్ ఎస్.కె. సింగ్ సాగిన తీరు, ఓ నిచ్చెనపై సుమిత్ కుమార్ నాయక్ చేసిన విన్యాసం, సిగ్నల్ రాకెట్ ఆకారంలో ఒకే బైక్ మీద దాదాపు 9 మంది ప్రయాణించిన వైనం.. వారి ధైర్య సాహసాలను చెప్పకనే చెప్పాయి.
కెప్టెన్ ఆర్ఎస్. శిఖావత్ ఆధ్వర్యాన ‘అభిమన్య వ్యూహం’ మాదిరి నిర్వహించిన స్టంట్ ఆశ్చర్యపరిచింది. ఒక దశలో వీరి డేర్ డెవిల్ స్టంట్స్ చూసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. ఆర్మీ జవాన్లంటే కేవలం సరిహద్దులను రక్షించేవారే కాదని, మానసిక స్థైర్యం, ఫిజికల్ స్టామినా, మోటార్ సైకిళ్లను తమ ఇష్టం వఛ్చినట్టు మలచుకోగల నైపుణ్యం కూడా కలిగినవారని ఈ స్టంట్స్ నిరూపించాయి.