క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ను హవాలా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సంక్రాంతి పండుగ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కోనసీమకు బయల్దేరిన చీకోటి గ్యాంగ్ ను పోలీసులు హవాలా డబ్బులున్నాయన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు నిర్వహించారు. ఏమీ లేదని తేలడంతో వదిలేశారు.
కోనసీమ జిల్లా మామిడికుదురులో ఈ సంఘటన చోటుచేసుకుంది. హవాలా సొమ్ము ఉందన్న సమాచారంతో..సంక్రాంతి నేపథ్యంలో కోడిపందేలకు స్నేహితులతో కలిసి వచ్చిన చీకోటి ప్రవీణ్ ను..పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు నాలుగు వాహనాల్లో వచ్చిన 20 మందిని ఇద్దరు ఎస్సైలు కృష్ణకుమారి, బాషాలు తనిఖీలు నిర్వహించారు.
వాహనాలలో ఏమీ లభ్యం కాకపోవడంతో వివరాలు సేకరించి వదిలేశారని చీకోటి తెలిపారు. ఎటువంటి ఇబ్బంది పెట్టలేదన్నారు. రొటీన్ చెకప్ చేశారని,రోడ్డుపైనే వాహనాలు చెక్ చేసి, డబ్బులు ఏమైనా దొరుకుతాయనుకున్నారని ఆయన అన్నారు. కానీ ఏమీ దొరకక పోయే సరికి వదిలేశారని అన్నారు. అయితే తాను స్నేహితులతో కేవలం సరాదా కోసమే పండుగకు ఇక్కడికి వచ్చానని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కాదని చీకోటి ప్రవీణ్ అన్నారు.
అయితే కోన సీమ వ్యాప్తంగా భోగి రోజే కోడి పందేలు, జూదం జోరుగా సాగాయి. అధికార పార్టీ నేతలే దగ్గరుండి ప్రోత్సహిస్తుండడంతో..ఇంకా యథేచ్చగా సాగుతున్నాయి. నిన్న ఒక్క రోజే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇక నోట్ల లెక్కింపుల కోసం ఏకంగా మిషన్లనే ఏర్పాటు చేసుకున్నారు పందెంరాయుళ్లు. మరి ఈ రోజు, రేపు ఇంకెన్ని వందల కోట్లు చేతులు మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.