జమ్మికుంట పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ను వెంటనే విడుదల చేయాలని దర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఓ గాడిద దొంగ తనం కేసులో గురువారం రాత్రి వెంకట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి జమ్మికుంట పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కావాలనే ఉద్ధేశ్య పూర్వకంగానే వెంకట్ ను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. చిల్లరగా ఓ గాడిదను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను ఇంకెంత కాలం ఇలా బందిస్తారని ప్రశ్నించారు.
ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఏసీపీ కోట వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. నిరసనలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకొని ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.