వెంటనే స్కూల్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్దుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. వెంటనే స్కూల్స్ తెరవాలని డిమాండ్ చేశారు. స్కూళ్లు తెరవాలని.. లేదంటే ఎన్నికల్లో ఓటు వేయమని హెచ్చరించారు.
కరోనా కేసుల పెరుగుదలతో పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 8 వరకు స్కూల్స్ బంద్ చేశారు. కేవలం విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్డెక్కిన ఉపాధ్యాయులు, విద్యార్థులు వెంటనే స్కూల్స్ తెరవాలని డిమాండ్ చేశారు. బర్నాల జిల్లాలోని వంద మందికి పైగా నిరసన కారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు.
గతేడాది కూడా కరోనా కారణంగా 9నెలల పాటు స్కూల్స్ మూతపడ్డాయని.. దీంతో విద్యార్ధుల ఉన్న చదువును మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా జనవరి 5 నుంచి స్కూల్స్ ను బంద్ చేశారన్నారు. అయితే.. స్కూల్ స్టాఫ్.. పిల్లలు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారని.. అందుకే వెంటనే స్కూల్స్ ను రీఓపెన్ చేయాలని ఉపాధ్యాయులు చెప్తున్నారు.
మొబైల్ ఫోన్ లలో చదవడం వల్ల తమ పిల్లల కళ్లు పాడవుతున్నాయని విద్యార్ధుల తల్లిదండ్రులు చెప్తున్నారు. అంతేకాకుండా పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం బయట ర్యాలీలు చేస్తున్నప్పుడు.. స్కూల్స్ మాత్రం ఎందుకు మూసివేయాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకులకు రాని కరోనా స్కూల్ పిల్లలకు వస్తోందా అని ప్రశ్నించారు.