హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ..వీఆర్ఏ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణలో ఉద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నాడని, ఉద్యోగ భద్రత కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వీఆర్ఏలకు మద్దతుగా వచ్చిన ఈటల, కేసీఆర్ తీరుపై భగ్గుమన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నామమాత్రంగా ఉన్నారనీ, అధికారాలన్నీకేసీఆర్ దగ్గరే ఉంచుకున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక కేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని శాపనార్థాలు పెట్టారు.
వీఆర్ఏలందరికీ పే–స్కేల్ ఇస్తామని, అర్హులైన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం ఇస్తామని హామీలిచ్చిన సీఎం.. ఇచ్చిన హామీలన్నింటినీ.. తుంగలొ తొక్కారని ఆరోపిస్తున్నారు.తమ డిమాండ్ లను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏలు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను అమలు చేయాలని ఓ వీఆర్ఏ తన ఒంటిపై రాసుకుని వినూత్న రీతిలో నిరసనను తెలియచేశాడు.
ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు,తెలంగాణ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం ప్రధాన కార్యదర్శి కందుకూరి బాపుదేవ్ లు మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23 వేల మంది వీఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలో క్రింది స్థాయి ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.