టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న తరుణంలో.. నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. ఇందులో మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం.. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నాని ట్విట్టర్ లో చిట్ చాట్ నిర్వహించారు. అభిమానుల అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.
దసరా’ సెటప్, సినిమాలో నాని రా అండ్ రగ్గుడ్ లుక్ చూసిన తర్వాత ‘పుష్ప: ది రైజ్’ చిత్రంతో పోలికలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే విషయం మీద ఓ నెటిజన్ నానీని ప్రశ్నించాడు. ‘పుష్ప’ & ‘రంగస్థలం’ కంటే ‘దసరా’ ఎలా భిన్నంగా ఉంటుంది? కొందరు ఉత్తరాది ప్రేక్షకులు ‘దసరా’ను ‘కేజీఎఫ్’ గా భావించి ఇగ్నోర్ చేస్తున్నారు. దయచేసి ఈ అపోహను తొలగించండి’ అని ట్వీట్ చేసాడు.
దీనికి నాని స్పందిస్తూ.. ”షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఇద్దరూ లెదర్ జాకెట్ ధరించారని ‘టెర్మినేటర్’, దిల్ వాలే దునియా లే జాయేంగే’ సినిమాలు ఒకేలా ఉండవు” అని తనదైన శైలిలో బదులిచ్చారు. ‘దసరా’ పూర్తి వైలెంట్ మాస్ డ్రామాలా కనిపిస్తోంది. మీ బలం ఫ్యామిలీ ఆడియెన్స్.. ఐతే సినిమాలో వారిని ఆకర్షించే అంశాలు ఉన్నాయా?? అని అడగ్గా.. వాళ్లకు కూడా ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నానని నాని చెప్పుకొచ్చారు.
“హిట్టు కొడుతున్నామా?, సూపర్ హిట్ కొడుతున్నామా?, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామా?” అని ఓ అభిమాని ప్రశ్నించగా.. “డైరెక్ట్ హార్ట్ మీద కొడుతున్నాం. మిగతావి మీరు చూసుకోండి” అని నాని పేర్కొన్నారు. ‘దసరా’ మూవీలో అల్టిమేట్ హై ఇచ్చే సీన్ ఒకటి చెప్పమని నానీని అడగ్గా.. ”2 గంటల 36 నిమిషాల మూడు ఫ్రేమ్ల సీన్” అంటూ సినిమా మొత్తం హై ఇస్తుందని చెప్పకనే చెప్పారు.
ఇటీవల కాలంలో నాని చిన్న మీడియం రేంజ్ దర్శకులతోనే వర్క్ చేస్తున్న నేపథ్యంలో.. “ఇంకా ఎంతకాలం కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తావ్ అన్నా… కొంచం టాప్ డైరెక్టర్స్ తో వర్క్ చెయ్యమని” ఓ ఫ్యాన్ కోరాడు. దీనికి నాని బదులిస్తూ.. “తేడా నాకు తెలియదు. టాలెంట్ కొత్తదైతే ఏంటి, పాతదైతే ఏంటి?” అని ప్రశ్నించారు. డైరక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి ఒక మాట చెప్పమని అడగ్గా.. ‘దొరికాడు మనకి ఒకడు.. ఒరిజినల్ పీస్’ అని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘దసరా’ అవుట్ పుట్ మీద చాలా సంతృప్తిగా ఉన్నట్లు నేచురల్ స్టార్ తెలిపారు.