ఈవారం కొత్త సినిమాల కోసం వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎఁదుకంటే, ఇది దసరా సీజన్. కొన్ని సినిమాలు దసరా సీజన్ ను టార్గెట్ చేశాయి. అందుకే శుక్రవారం కంటే ముందు థియేటర్లలోకి వస్తున్నాయి. మరి ఈ ఏడాది దసరా బరిలో నిలిచిన ఆ సినిమాలేంటి? వాటిలో నిలదొక్కుకునే సత్తా దేనికి ఉంది?
దసరా కనుకగా బుధవారం ఒకేసారి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో రెండు సినిమాల మధ్య హోరాహోరీ నడుస్తోంది. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున చేసిన ది ఘోస్ట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ది ఘోస్ట్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం లేదని, గాడ్ ఫాదర్ కు పోటీగా దసరా బరిలో నిలిచిందని, కొన్ని రోజుల కిందటే తొలివెలుగు ప్రకటించింది. చెప్పినట్టుగానే చిరు వెర్సెస్ నాగార్జున అన్నట్టు తయారైంది దసరా బాక్సాఫీస్.
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేసిన సినిమా గాడ్ ఫాదర్. గత చిత్రం ఆచార్య దెబ్బ నుంచి బయటపడాలంటే, గాడ్ ఫాదర్ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. అందుకే ఈ సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు చిరు. అన్నీ తానై ప్రచారాన్ని ముందుండి నడిపించారు. పైగా ఈసారి ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ కూడా ఉంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఇందులో నటించాడు. అయితే చిరు ఫోకస్ మొత్తం టాలీవుడ్ లో గాడ్ ఫాదర్ సక్సెస్ పైనే ఉంది. ఈ సినిమాతో ఆయన తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు.
ఇక గాడ్ ఫాదర్ కు పోటీగా వస్తోంది ది ఘోస్ట్. నాగార్జున నటించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా ఇది. ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ అదే చెబుతోంది. పైగా సినిమాలో 12 ఫైట్స్ ఉన్నాయని ప్రకటించి దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరింత ఊరిస్తున్నాడు. దీంతో ఘోస్ట్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అయితే ఈ దసరా పోటీ ఈ రెండు సినిమాల మధ్య మాత్రమే లేదు. పించ్ హిట్టర్ లా మధ్యలో స్వాతిముత్యం కూడా దూరింది. బెల్లంకొండ గణేశ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. తనది దసరా సినిమా అని, అందుకే చిరు-నాగ్ మధ్యలో తన సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నానని అంటున్నాడు. మరి ఈ 3 సినిమాల్లో ఏది దసరా విజేతగా నిలుస్తుందో చూడాలి