హార్ట్ టచింగ్ కథల నుంచి మాస్ మూవీస్ వైపు నాని టర్న్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు సాఫ్ట్ గా ఉండే కథలు ఎంచుకున్న ఈ హీరో.. టక్ జగదీశ్ నుంచి దారి మార్చాడు. ఇందులో భాగంగానే దసరా సినిమాను అంగీకరించినట్టున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ”దసరా” చిత్రం రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో వస్తోంది. నాని కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా వస్తోంది దసరా.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తిసురేష్ పై ఓ పాటని షూట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటునాటు పాటతో సంచలనం సృష్టించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నాని బీడీ వెలిగించి సింగరేణిలో తన గ్యాంగ్‌తో కలిసి వస్తున్న అగ్రెసివ్ మాస్ లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. నాని ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేస్తున్న ఈ మూవీ, గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో సాగుతుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.