రీసెంట్ గా వరుసపెట్టి విజయాలు చూసింది టాలీవుడ్. సీజన్ తో సంబంధం లేకుండా కార్తికేయ2, బింబిసార, సీతారామం లాంటి సక్సెస్ లు పడ్డాయి. దీంతో టాలీవుడ్ మార్కెట్ ఊపందుకుందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే, కీలకమైన దసరా సీజన్ లో మార్కెట్ చతికిలపడింది. దసరా బరిలో 3 సినిమాలు రిలీజైతే ఒక్కటి మాత్రమే సక్సెస్ అయింది.
చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా బరిలో విజేతగా నిలిచింది. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా, చిన్నచిన్న మార్పులతో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం స్టడీగా వసూళ్లు అందుకుంటోంది.
గాడ్ ఫాదర్ తో పాటు రిలీజైన ది ఘోస్ట్ సినిమా ఫ్లాప్ అయింది. అదిరిపోయే యాక్షన్ ఉన్నప్పటికీ, కనెక్ట్ అయ్యే ఎమోషన్ లేకపోవడంతో నాగార్జున మూవీ ఫ్లాప్ గా నిలిచింది. మొదటి రోజు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వచ్చినప్పటికీ, ఆ తర్వాత కోలుకోలేకపోయింది.
ఇక దసరా బరిలో చిన్న సినిమాగా వచ్చిన స్వాతిముత్యంది మరీ వింత పరిస్థితి. సినిమా బాగుంది, యూత్ తో పాటు ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. కానీ ఎవ్వరూ థియేటర్లకు వచ్చి స్వాతిముత్యం చూడడం లేదు. బహుశా, దసరా సీజన్ లో చిన్న సినిమా చూడాలని ప్రేక్షకులు అనుకోలేదేమో. మరీ ముఖ్యంగా ఓవైపు గాడ్ ఫాదర్ ఉన్నప్పుడు, మరోవైపు స్వాతిముత్యం కోసం వెళ్లే ప్రేక్షకులు ఎంతమంది?
ఇక దసరా కంటే కాస్త ముందొచ్చిన పొన్నియన్ సెల్వన్1 సినిమా తెలుగు మార్కెట్లో ఫ్లాప్ అయింది. ఈ శుక్రవారం క్రేజీ ఫెలో, బాయ్ ఫ్రెండ్ ఫర్ హయ్యర్, కంతారా సినిమాలొస్తున్నాయి. వీటిలో ఏ సినిమా నిలబడుతుందో చూడాలి.