అధికార అహంకారంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేశారని ఆరోపించారు ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో 2,540 గజాల భూమిని కొందరు కబ్జా చేయాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళపై కేసులు పెట్టాలని ప్రయత్నించిన సిఐ నాగేశ్వర్ రావుని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒత్తిడి చేసి రాత్రిరాత్రికే బదిలీ చేయించారని విమర్శించారు. పని చేస్తున్న అధికారిని పని చేయనివ్వకుండా అడ్డుకోవడం ఏంటి? ఇంత దుర్మార్గం ఎందుకు? అని ప్రశ్నించారు.
రాస్ట్రంలో పోలీస్ మాన్యువల్ ని పూర్తిగా కాలరాస్తున్న పరిస్థితి నెలకొందని.. ఐపీఎస్ అధికారులు కూడా టీఆర్ఎస్ నాయకులకు కట్టుబానిసులుగా మారి కిందస్థాయి అధికారులని కూడా బానిసలుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల సమస్యకు కారణం కింద స్థాయిలో పని చేసే అధికారులలో వున్న ఆత్మన్యూనత భావమేనని తెలిపారు. ఐపీఎస్ అధికారులకు టీఆర్ఎస్ నాయకులు తమ బ్యాంకు ఖాతాల నుండి జీతాలు ఇవ్వడం లేదన్నారు. ప్రజలు కట్టిన పన్నుతో జీతాలు తీసుకుంటున్నారని.. వారికి సేవకులుగా ఉండాల్సిందిపోయి బానిసకొక బానిసగా అన్నట్టుగా మారిపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. రిటైరైన తర్వాత ప్రభుత్వంలో సలదారులుగా చేరిపోవాలనే ఆలోచన అధికారులలో ఉందన్నారు. చిన్నపాటి జీతం కోసం, బుగ్గకారు కోసం ప్రజల శాంతి భద్రతలతో ఆడుకోవడం ఎంత వరకు నైతికమని నిలదీశారు.
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రజాప్రతినిధులకు సలాం కొడ్తున్నారని అన్నారు దాసోజు. ఎమ్మెల్యే , మంత్రుల లెటర్ ఉంటేనే పోలీస్ ట్రాన్స్ ఫర్లు అవుతున్నాయని… మంత్రులు, ఎమ్మెల్యేలు, డిజీపీ, కమిషనర్ సిఫార్స్ లేనిదే తెలంగాణలో ట్రాన్స్ ఫర్లు జరగడం లేదన్నారు. నేడు తెలంగాణలో మెరిట్ ఆధారంగా ఒక్క ట్రాన్స్ ఫర్ కూడా లేదని… ఎస్ఐ, సిఐలని బానిసలుగా తయారుచేసి ఎమ్మెల్యేల చెప్పు చేతల్లోకి తీసుకునే ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా డీజీపీ ఇచ్చిన ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు.
‘‘అక్రమ భూదందాలని అడ్డుకోవాలని చూసిన సిఐని బదిలీ చేస్తారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునే అధికారులని ఇష్టారాజ్యంగా బదిలీ చేస్తారు. పేపర్ తెరిస్తే ఇవే వార్తలు, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ భూదందాలని నిలదీస్తే అక్కడి సిఐలని బదిలీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 12 నెలల వ్యవధిలో శివచంద్ర, నాగేశ్వర్ రావు అనే ఇద్దరు సిఐలని బదిలీ చేశారు. శివ చంద్ర ర్యాడిసన్ పబ్ పై చర్యలు తీసుకుంటున్నాడని లోకల్ ఎమ్మెల్యేకి చెప్పి అతడ్ని బదిలీ చేయించారు. తర్వాత వచ్చిన నాగేశ్వర్ రావు సమర్దవంతంగా పని చేస్తూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో 2,540 గజాల భూమిని కొందరు కబ్జా చేయాలని ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే ఒత్తిడి చేసి ఆయన్ని రాత్రిరాత్రికే బదిలీ చేయించారు. పని చేస్తున్న పోలీసులని పని చేయనివ్వకుండా అడ్డుకోవడం ఏంటి? ఎమ్మెల్యేలు దానం, మాగంటి గోపినాథ్ లు మా మనుషులే వుండాలని ఆధిపత్యం చూపించుకుంటూ ఈరోజు మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారు. రాత్రికి రాత్రి పంజాగుట్ట ఏసీపీ నర్సింగ్ రావు ట్రాన్స్ ఫర్ విత్ డ్రా చేయించారు మాగంటి. ఈ దుర్మార్గాలపై విచారణ జరపాలి’’ అని డిమాండ్ చేశారు శ్రవణ్.