మహబూబ్‌నగర్ లో భూసేకరణ పేరిట వందల ఎకరాలను లాక్కుంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. భూములు తీసుకోవడం లేదని చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ హన్వాడలో రాత్రికి రాత్రి జేసీబీలు పంపి కంచెలు వేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పేదలు బతుకొద్దా..? అని శ్రవణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కొవడానికి అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. అధికారులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బానిసలుగా మారారని ఆరోపించారు. సీఎస్ సోమేశ్ కుమార్ కు అసలు మెదడు ఉందా..? అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టుకు ఒకలా చెప్పి.. ప్రవర్తించే తీరు మరోలా ఉందని విరుచుకుపడ్డారు శ్రవణ్. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భూములు తప్పనిసరి అయితే.. 2013 చట్టం ప్రకారం భూపరిహారం చెల్లించాలన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
బడాబాబుల కోసం పేదల భూములు లాక్కుంటున్నారని విరుచుకుపడ్డారు. మంత్రి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోందని విమర్శలు గుప్పించారు. పేదల భూములను గుంజుకొని.. మట్టిపని చేస్తూ బతుకెళ్లదీసే రైతన్నలను అనాధలను చేస్తున్నారని మండిపడ్డారు శ్రవణ్.