రాష్ట్ర యువతలో కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ చెప్పడంతోనే ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. టీఎస్పీఎస్సీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. 300 మంది పనిచేసే చోట కేవలం 80 మంది మాత్రమే ఉండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
నిరుద్యోగుల వ్యతిరేకతను తగ్గించుకోవడానికి నియోజకవర్గాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు శ్రవణ్. ముందుగా రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీపై సమీక్షలో సీఎస్ చెప్పిన మాటలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమేనన్నారు శ్రవణ్. కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు, మరికొన్ని బోర్డుల ద్వారా చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పారు. బోర్డుల ద్వారా నియామకాలు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలను పెట్టడానికి కుట్ర జరుగుతోందా అని అనుమానం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో యువత పెద్దన్న పాత్ర పోషించిందని.. బిస్వాల్ కమిటీ లో చెప్పిన 1.91 లక్షల్లో మిగిలిన లక్ష ఉద్యోగాలు ఎక్కడ అని నిలదీశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలను నిరుద్యోగులు గల్లా పట్టి అడగాలన్నారు. రాష్ట్ర జనాభాకు ప్రభుత్వ ఉద్యోగులు 1.4 శాతం మాత్రమే ఉన్నారని వివరించారు శ్రవణ్.