దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న టీఆర్ఎస్ నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారు. ప్రతి పక్ష పార్టీగా కాంగ్రెస్.. అధికార పార్టీ తప్పులని ప్రశ్నిస్తే.. కొడతాం, నరుకుతాం, చంపుతామని సభ్యత లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ భాష వచ్చు. కానీ ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది. ప్రజాస్వామ్యంలో చంపడాలు, నరకడాలు. కోసి కారం పెట్టడాలు ఉండవు. టీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే మాతో చర్చకు రావాలి. అంతేగానీ ఇలా వీధి రౌడీ కంటే నీచంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటు.
బీజేపీకి సూటి ప్రశ్న. నిజంగా బీజేపీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే , కేసీఆర్ చేసిన అవినీతిని బయటపెట్టాలనే ఉద్దేశ్యం ఉంటే ప్రగతి భవన్‌పై ఒక్కఇన్‌కమ్ టాక్స్ రైడ్ చేసినా కేసీఆర్ జైల్లో కూర్చుంటారు.
ఏడేళ్లుగా ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా దోచేసి కోట్లు పోగేసుకున్న టీఆర్ఎస్ పార్టీ పెద్దలు అధికార, ధన మదంతో ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పార్టీపై దాడులు చేస్తున్నారు. కేసులతో బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై ఒక కౌరవ సేనలాగా కాంగ్రెస్ పార్టీ పై దాడి చేస్తున్నారు. ఎన్ని దాడులు చేసిన కాంగ్రెస్ పార్టీ బెందిరింపులకు లొంగదు. ప్రజల తరుపున ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది.
టీఆర్ఎస్ నాయకులంతా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ముని అప్పనంగా దోచుకున్న లీడర్లు కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నారు. నాడు తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వ్యక్తులు.. అవినీతి సొమ్ముతో నేడు తెల్లబెంజ్ కార్లు కొనుక్కుని విర్ర వీగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరినీ వదలదు. టీఆర్ఎస్ నేతల అవినీతి బాగోతం ప్రజల ముందు బట్టబయలు చేస్తాం.
రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పింది. కానీ సీఎస్ సోమేశ్ కుమార్ మాత్రం కేవలం 56వేల ఖాళీలని చెబుతున్నారు. ఇది న్యాయమా ? ఎందుకు దొంగ లెక్కలు చెబుతున్నారు. బిశ్వాల్ కమిటీ లెక్కల ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే 20 శాతం రిజర్వేషన్ ప్రకారం వేలాది మంది దళిత, గిరిజన యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి కదా.. వేలాది దళిత గిరిజన కుటుంబాలు ఆత్మ గౌరవంతో బతికేవి. మరి కేసిఆర్ ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు ? ఉద్యోగా భర్తీ ఎందుకు చేయలేదని దళితుల పక్షాన ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ పై దాడులు చేస్తున్న కేసీఆర్.. దళిత బంధు ఎలా అవుతారు.. ? ముమ్మాటికీ దళిత ద్రోహి.