ధరణి పోర్టల్ తీరు కొండనాలుకకి మందేస్తే వున్న నాలుక ఊడిపోయినట్లుగా వుందని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ధరణి వలన ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమావేశం జరిగింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు శ్రవణ్. ఒక ఆలోచన లేకుండా, చర్చ లేకుండా, ఎవరితో సంప్రదింపులు జరపకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్ధతో రూపొందించిన ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణలో భూ యజమానులంతా బిచ్చగాళ్లుగా మారిపోయి ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసుల దగ్గర దిక్కు తోచని స్థితిలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు.
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ సర్వే జరిపి భూసమస్యలని సంపూర్ణంగా పరిష్కరించాలని అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్డి ఎద్దు చేలో పడినట్లు అనాలోచితంగా, భూ సర్వే చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. ధరణి సృష్టించిన సమస్యల కారణంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితి నెలకొంది. మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు కూడా వారు యజమానులు కాదని ధరణి చూపిస్తోంది” అని మండిపడ్డారు దాసోజు.
భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కార్యచరణ సిద్ధం చేసిందన్నారు శ్రవణ్. ధరణి బాదితులకు అండగా ఉంటూ వారం రోజులు పాటు భూ పరిరక్షణ ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయా మండల కేంద్రాల దగ్గర బాధితుల నుంచి వినతి పత్రాలు స్వకరిస్తామన్నారు. మండలాల వారీగా సేకరించిన సమస్యలను నివేదికగా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం ఎసైన్డ్ భూముల దోపిడీకి పాల్పడుతున్న నేపథ్యంలో వాటికి రక్షణ కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. డిస్ట్రిక్ లెవల్ విజిలెన్స్ మానటరింగ్ కమిటీలని ప్రభుత్వం విధ్వంసం చేసిందన్న దాసోజు… వాటిని పరిరక్షించడానికి కూడా కాంగ్రెస్ పనిచేస్తుందని వెల్లడించారు.
భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యు పెంచేస్తన్నట్లుగా ప్రభుత్వం చెబుతోందన్న శ్రవణ్.. ఇది దుర్మార్గమైన కుట్ర అని అభివర్ణించారు. గతంలో మల్లన్న సాగర్, కాళేశ్వరం, అనేక ప్రాజెక్ట్ ల పేరుమీద భూ సేకరణ జరిపినప్పుడు చట్టం అనుసరించి ప్రతీ రెండేళ్ళకు మార్కెట్ వాల్యుకి అనుసరించి రిజిస్ట్రేషన్ వాల్యు పెంచాల్సిన అవసరం వుండేదన్నారు. కానీ.. గత ఏడేళ్ళుగా ధరలు పెంచలేదని.. ప్రభుత్వం మీద భారం పడుతుందనే కుట్రతోనే ఇది చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భుసేకరణలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ధర పెంచుతామని ప్రజల నోట్లో మన్నుకొట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. దీంతో పాటు ప్రతి ఆరునెలలకోసారి స్టాప్ డ్యూటీని పెంచేస్తూ ప్రజల నడ్డి విరుస్తూ దుర్మార్గమైన దోపిడీకి ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజమెత్తారు దాసోజు.