దాసోజు శ్రవణ్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి
జీవో 111 పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. అందులో లక్ష ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ చెందిన పెద్దలే బెదిరించి కొనుగోలు చేశారు. 111 జీవో పరిధిలో ఉన్న భూములపై బహిరంగ చర్చ, విచారణ జరగాలి. ఈ 8 ఏళ్లలో భూములని ఎవరు కొన్నారు? ఎవరి చేతులు మారాయి? కొన్నవాళ్లలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతమంది? వారికి కొమ్ముకాసే పెద్దలు ఎంతమంది? ఇదంతా బహిరంగంగా విచారణ జరగాలి.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అవసరం లేదని కేసీఆర్ చెప్పడం వాటిని ఎండగట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలనే ఆలోచనగా కనిపిస్తోంది. ఒక పక్క హరితహారం పేరుతో చెరువులని కాపాడాలని చెబుతున్న కేసీఆర్.. మరోపక్క గండిపేట, హిమాయత్ సాగర్ అవసరం లేదని చెప్పడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాక ఇంకేంటి?
7,951 ఫీల్డ్ అసిస్టెంట్స్ ని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్ పెద్ద ఘన కార్యం చేసినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. హక్కుల కోసం పోరాటం చేయడం ఫీల్డ్ అసిస్టెంట్స్ చేసిన తప్పా? కేసీఆర్ శాడిజం వలన 70 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ చనిపోయారు. వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ, సంపద సృస్టించే తెలివి లేదని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అభివృద్ధి చేయమని ప్రజలు కేసీఆర్ ని ఎన్నుకుంటే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడం ఏం పాలన? మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు పోటీ పడి కేసీఆర్ చెక్క భజన కేంద్రంగా అసెంబ్లీని మార్చేయడం దుర్మార్గం. ఆయన భజన చేయాలంటే టీఆర్ఎస్ భవన్ లో చేసుకోండి. అంతేకాని ప్రజల సొమ్ముతో చట్ట సభలని భజన కేంద్రాలుగా వాడుకోవడం క్షమించరాని నేరం.