తెలంగాణ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడగా.. అదే బాటలో దాసోజు శ్రవణ్ నడుస్తున్నారు. కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారికంగా రాజీనామా విషయాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఈమధ్యే కాంగ్రెస్ లో చేరారు. ఆమె ప్రస్తుతం ఖైరతాబాద్ కార్పొరేటర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి దాసోజు పోటీ చేశారు. ఇప్పుడు విజయారెడ్డి చేరికతో ఆయన తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీని వీడుతున్నట్లు సమాచారం.
ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఈ సమయంలో నేతలు వరుసబెట్టి హ్యాండ్ ఇస్తుండడం పెద్ద ఎదురుదెబ్బే. చిన్న చిన్న చోటా లీడర్లు జాయిన్ అవుతున్నా.. వారితో పెద్దగా ఉపయోగం ఉండదనే చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ లోఈ రాజీనామాలు కలిసి వస్తాయని అనుకుంటున్నారు. రాజగోపాల్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. అయితే.. దాసోజు శ్రవణ్ ఏ పార్టీలో చేరబోతున్నారన్న విషయంపై క్లారిటీ లేదు.