ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కావల్సిన వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు.
ఈక్రమంలోనే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు రంగం చేసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే.. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి.
మే ఆరు నుంచి రెండు రోజుల పాటు రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. దీంతో అప్రమత్తం అయిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ ఛైర్మన్లతో సమావేశమై.. రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. “రైతు సంఘర్షణ సభ” పేరుతో నిర్వహించనున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు స్వచ్చందంగా తరలివస్తారని నేతలు భావిస్తున్నారు.