కోవిడ్ చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది. కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. అలా ఓ మహిళకు తన భర్తను దూరం చేసింది ఈ మహమ్మారి. దీంతో ఆమె జీవితం అల్లకల్లోలంగా మారింది. ఇలాంటి సమయంలో అత్తామామలే తల్లిదండ్రులుగా మారి.. ఆమెకు కొత్త జీవితాన్ని అందించారు. తమ కొడుకు మృతిచెందిన చేదు వార్తను దిగమింగి.. తమ కోడలికి రెండో వివాహం చేశారు. అంతేకాదు, తమ ఆస్తిని కూడా రాసిచ్చారు. కోడలి విషయంలో చేసిన పనికి ఈ అత్తమామలపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ప్రకాష్ తివారీకి భార్య రాణిగి తివారి కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. ప్రియాంక్ తివారీకి రీచా అనే అమ్మాయితో వివాహం చేశారు. వీరికి అనన్య తివారీ(9) అనే కూతురు ఉంది. అయితే, 2021లో కరోనాతో ప్రియాంక్ తివారీ చనిపోయాడు. చిన్నవయసులో కొడుకు చనిపోవడం, వృద్ధాప్యంలో ఉన్న తమకు తోడు ఉండాలన్న ఆలోచనతో కోడలిని తమ దగ్గరే ఉంచుకున్నారు.
అయితే, రీచా తన భర్త గురించే ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోతుండటాన్ని యుగ్ ప్రకాష్ గమనించాడు. అలాగే, ఏదో ఒక రోజు తాము చనిపోతే కోడలు ఒక్కతే ఒంటరిగా మిగిలిపోతుందన్న ఆలోచన వారికి కలిగింది. ఈ క్రమంలో ఆమెకు మరో పెళ్లి చేయడానికి సిద్దపడ్డారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహాలు తీసుకున్నాడు యుగ్ ప్రకాష్ తివారీ.
ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన వరుణ్ మిశ్రాతో రీచాకు దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అది కూడా అక్షయ తృతీయ రోజున వివాహం జరిపించి.. కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అంతేకాదు, నాగ్‌పూర్‌లో ప్రియాంక్ తివారీ కొనుగోలు చేసిన ఓ భవనాన్ని( రూ.60 లక్షల విలువ) రీచాకు బహుమతిగా ఇచ్చారు. రీచా భవిష్యత్‌లో ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతోనే ఆ భవనం రాసిచ్చామని యుగ్ ప్రకాశ్ దంపతులు తెలిపారు. వివాహం అనంతరం వరుణ్ మిశ్రాతో కలిసి రీచా, కూతురు అనన్య నాగ్‌పూర్ వెళ్లిపోయారు. కోడలికి మరో పెళ్లి చేసిన యుగ్ ప్రకాశ్ దంపతులు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.